కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలు నేడు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడెప్పుడు బడికెళ్దామా అని వేచిచూసిన విద్యార్థులు.. తెల్లవారు జామునే లేచి సిద్ధమయ్యారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులను లోనికి అనుమతిస్తున్నారు.
విద్యార్థుల కేరింతలంతో కరీంనగర్‌లోని పాఠశాలలు సందడిగా మారాయి. దాదాపు పది నెలల తర్వాత నగరంలోని బడులు కళకళలాడుతున్నాయి. విద్యార్థులంతా మాస్కు ధరించి, చేతులు శానిటైజ్ చేసుకుని, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని తరగతి గదిలోకి వెళ్తున్నారు. క్లాస్‌రూమ్‌లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటున్నారు.
మొదటి రోజు కావడం వల్ల నేడు.. ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాలల యాజమాన్యం తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పది నెలల తర్వాత పాఠశాలకు రావడం, స్నేహితుల్ని కలవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు.