కరోనా నివారణలో భాగంగా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించి... విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. అయితే కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక... విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ప్రైవేటు పాఠశాలలు మాత్రం సమయం వృథా చేయడం కన్నా... ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చాయి. విద్యాశాఖ ఈ తరహా విధానాన్ని చేపట్టవద్దని సూచిస్తుండగా.... కరీంనగర్ జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ బోధన కొనసాగించేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 652 ఉండగా వాటిల్లో 32 వేల 12 మంది, ప్రైవేటు పాఠశాలలు 276 ఉండగా, వాటిల్లో 59 వేల 992 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యను కాపాడుకునేందుకు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ప్రవేశాలను సైతం ప్రారంభించాయి. విద్యార్థులు... చరవాణులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని పాఠ్యాంశాలు వింటున్నారు.
విద్యార్థులకు ఎక్కువ రోజులు చదువులు లేకపోతే... దారితప్పే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియని నేపథ్యంలో... అప్పటి వరకూ చదువులు ముందుకు సాగాలంటే ఆన్‌లైన్ తరగతులే మార్గమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరుచుకున్నా పిల్లల్ని బడికి పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని ట్రస్మా నాయకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ తరగతుల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు దారితప్పకుండా ఉండేందుకు ఈ తరగతులు అవసరమేని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్నెట్ సమస్య, పరస్పర చర్చల వంటి విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నా... అసలే తరగతులు లేకపోవడం కన్నా మేలని అభిప్రాయపడుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైనా గ్రామాలు, మండల కేంద్రాల్లో మాత్రం సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ తరగతులేమీ నిర్వహించడం లేదు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోవడంపై సందిగ్ధత ప్రత్యామ్నాయాలవైపు అడుగేస్తున్నాయి ప్రైవేట్ విద్యాసంస్థలు.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన