మానేరు నది పరివాహక తీరంలోని పలు ప్రాంతాలు ఇసుక రవాణాకు అడ్డాలుగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ ఆదాయాన్ని సమకూర్చుతుంటే.. మరోవైపు సమాంతర వ్యవస్థగా అక్రమ ఇసుక రవాణా ఇష్టానుసారంగానే సాగుతోంది. ఈనెల 3న అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని.. స్థానిక అవసరాల కోసం కొత్తపాలసీని అమలు చేయాలని జిల్లా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నా.. అది అప్పటివరకు మాటగానే మారిపోయింది.
ఠాణాల ముందు నుంచే
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా నిత్యం ఎక్కడికక్కడే ఇసుక దొంగలు యథేచ్ఛగా చౌర్యానికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరీ యంత్రాంగానికి ఈ విషయం తెలియదనుకుంటే అది ముమ్మాటికి పొరపాటే అవుతుంది. ఈ వాహనాలన్నీ ఆయా ఠాణాల ముందు నుంచే.. ప్రభుత్వ కార్యాలయాల చెంత నుంచే వెళ్తుంటాయి. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, మానకొండూర్, జమ్మికుంట మండలాల్లోని 12 గ్రామాల్లో మాత్రం ఇసుకను తరలించుకుపోతున్నారు.
రోజుకు 2 వేల ట్రాక్టర్ల ఇసుక దోపిడి
దాడులు, జరిమానాలు, ఇసుక దందా ముందర ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఈ నది పరివాహక ప్రాంతంతోపాటు వీటికి అనుసంధానంగా ఉన్న వాగుల నుంచి కుప్పలుతెప్పలుగా ఇసుక చోరీకి గురవుతోంది. జిల్లా వ్యాప్తంగా రోజులో ఎంతలేదన్నా 2 వేల ట్రాక్టర్ల సంపద దోపిడీకి గురవుతుంది. నెల మొత్తంగా హీనపక్షంగా 15 రోజులపాటు అడపాదడపా అక్రమం సాగినా అక్రమవ్యాపారుల జేబుల్లోకి రూ.4.5కోట్ల వరకు వెళ్తున్నాయి.
ఇవన్నీ ఉత్తుత్తవే..!
కేసులు.. జరిమానాలు.. పట్టివేతలు.. బెదిరింపులు ఇవన్నీ ఉత్తుత్తివేనని ఇసుకాసురులు భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇసుక విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తున్నా.. ఆయా ఠాణాల పరిధిలోని సిబ్బంది మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, తిమ్మాపూర్ మండల సమీపంలోని కొత్తపల్లి, గన్నేరువరం సమీపంలోని రేణిగుంట, గుండ్లపల్లిశివారులో నుంచి ఇసుక తరులుతోంది. మానకొండూర్ మండలం వెల్ది, లింగాపూర్, ఊటురు, వేగురుపల్లి, శ్రీనివాస్‌నగర్, వీణవంక మండల పరధిలో పోతిరెడ్డిపల్లి, కొండపాక, కోర్కల్, చల్లూరు, జమ్మికుంట మండలం విలాసాగార్, తనుగుల పరిసరాల్లో నుంచి ఇసుక చోరీ జరుగుతోంది. శంకరపట్నం మండలంలోని గద్దపాక వాగు సహా రాజీవ్‌రహదారిని ఆనుకుని ఉన్న మోయతుమ్మెద వాగులో ఈ దందా దర్జాను ఒలికిస్తోంది.
అధికారులేమన్నారంటే..!
నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఇసుక రవాణాపై తగు దృష్టిని సారిస్తామని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్ అన్నారు. తక్షణమే ఆయా మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేస్తామని ఇసుక దందాను అరికడతామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- ఇదీ చూడండి : ఇంటర్ సప్లి ఫలితాలపై... కేటీఆర్ ట్వీట్