ప్రజలు గుంపులుగా సంచరిస్తే వైరస్ సోకుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే నిబంధనలు సడలించినప్పుడు మాత్రం ప్రజలు నిబంధనలు పాటించకుండా పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్వచ్ఛందంగా తమకు సహకరించే వారు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 50మందికి పైగా ముందుకు వచ్చారు.
వారికి శిక్షణ ఇచ్చిన పోలీసులు... రద్దీగా ఉండే ప్రాంతాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవాలని.. శానిటైజర్లు వినియోగించాలని.. అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలని సూచనలు చేస్తున్నారు. గుంపులుగా కనిపించే వారు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్‌లో కూరగాయలు, పండ్ల మార్కెట్, చేపల మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉండటంతో వాలంటీర్లు వారిలో అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ..
భౌతిక దూరం పాటించక పోతే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయో నచ్చచెప్పడమే కాకుండా విపరీత రద్దీని కూడా అరికట్టే యత్నం చేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఇళ్లలో ఉండే కంటే ఇలాంటి సమాజ సేవ చేయడం సంతోషంగా ఉందని వాలంటీర్లు తెలిపారు. వారి సేవల పట్ల పోలీసులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించిన కేవలం నాలుగు గంటల్లో... వేల మంది జనాలు మార్కెట్‌లోకి వస్తుంటే సిబ్బంది కొరత అనే ఇబ్బంది లేకుండా వాలంటీర్లు చేదోడు వాదోడుగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం లాక్‌డౌన్ ఎందుకు అమలు చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం ఉంటుందని సూచించడంలో వాలంటీర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రాథమిక దశలో గుర్తిస్తే.. బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చు'