రైతు వేదికలు నిత్య అధ్యయన కేంద్రాలుగా భాసిల్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన 2, 601 రైతు వేదికల్లో సత్వరమే శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటైన పలు రైతు వేదికలను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ వేదికల్లో రైతులు.. సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ సూచించారు. వ్యవసాయ సంబంధ సేవలన్ని అన్నదాతలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులకు ప్రయోజనంగా ఉండే భూకార్డులను అందిస్తాం. అందులో భూసార పరీక్షల వివరాలు, పంట సాగు విశ్లేషణలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. రైతు వేదికలకు అందుబాటులో.. రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం.
- మంత్రి నిరంజన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ ఛైర్మన్ విజయ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి'