కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఎండీ రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. వరుస వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి రిజర్వాయర్లో చేరుతున్నది. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో చెరువులు మత్తళ్లు దూకడం వల్ల వర్షపు నీరంతా మోయతుమ్మెద, బిక్కవాగు ద్వారా ప్రవహిస్తూ ఎల్ఎండీ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో పలు గ్రామాలు సైతం నీటమునిగి అతలాకుతలమవుతున్నాయి. దిగువ మానేరు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండలోని పలు ప్రాంతాలకు సాగునీటిని అందించే ఎల్ఎండీ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. మోయ తుమ్మెద వాగు ద్వారా సుమారు యాభై వేలు క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతోంది. మూడు రోజుల క్రితం 9.47 టీఎంసీల నీటినిల్వ ఉన్న ఎల్ఎండీ రిజర్వాయర్లోకి గత మూడు రోజుల్లో రెండున్నర టీఎంసీల నీరు వచ్చి చేరింది. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్ఎండీ రిజర్వాయర్కి నీరు చేరుతుందని ఎస్ఈ శివకుమార్ తెలిపారు. ఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఈలు ప్రతీ గంటకోసారి నీటినిల్వలను పరిశీలిస్తూ సీఎంవో ఆఫీసుకు సమాచారం అందిస్తున్నారు. వర్షాల కారణంగా ఎల్ఎండీ దిగువ ఆయకట్టు రైతుల కోరిక మేరకు నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు