కరీంనగర్ జిల్లా దిగువ మానేరులో కొండ చిలువ కలకలం సృష్టించింది. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మత్స్యకారులు దిగువ మానేరు జలాశయంలో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. రోజులాగే చేపల వేటకు వెళ్లిన బోయిని వెంకటేశ్ తెప్పపై నుంచి వలను లాగుతూ చేపలు తీస్తున్న క్రమంలో వల బరువుగా అనిపించగా... భారీ చేప చిక్కిందనుకొని ఒడ్డుకు తీసుకువచ్చి చూడగా కొండచిలువ దర్శనమిచ్చింది. అకస్మాత్తుగా పెద్ద సర్పాన్ని చూడగానే మత్స్యకారుడు భయపడిపోయారు. సుమారు మూడు మీటర్ల పొడవు, 35 కిలోల బరువున్న కొండచిలువ వలకు చిక్కుకొని విడిపించుకునేందుకు ప్రయత్నించింది.
భయాందోళనలకు గురైన వెంకటేశ్ మిత్రులతో కలిసి కొండచిలువను హతమార్చారు. దిగువ మానేరు జలాశయం బ్యాక్ వాటర్ కారణంగా పాముల బెడద విపరీతంగా ఉందని మత్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. విష సర్పాలు నీటిలో ఈదుతూ తెప్పె పైకి వస్తున్నాయని వాపోయారు. ఇటీవల ఓ కొండచిలువ వలకు చిక్కుకొని మృతిచెందగా.. తక్కువ వ్యవధిలోనే రెండోసారి మరో కొండచిలువ దర్శనమిచ్చిందన్నారు. దీని కారణంగా సుమారు రూ.యాబై వేల విలువ చేసే వల పాడై పోయిందని బాధిత మత్స్యకారుడు తెలిపారు.
ఇదీ చదవండి: భయం భయం: ఆచూకీ ఎక్కడ.. పులి ఏమైనట్టు.. ఎటెళ్లినట్టు!