కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. స్మార్ట్ సిటీ గుర్తింపుతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక కేంద్రంగా ఉండటంతో పాటు నగరానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం వచ్చి స్థిర నివాసం ఏర్పరర్చుకున్న వారూ పెరిగిపోతున్నారు. నగరంలో వివిధ పనుల నిమిత్తం రోజుకు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అధికారుల అంచనా.
- నగర విస్తీర్ణం 2.385 చదరపు కిలోమీటర్లు
- సుమారు వాహనాలు- 2 లక్షల 70వేలు
- ద్విచక్రవాహనాలు- లక్ష 98వేలు
- ఆటోలు- 25వేలు
- నాలుగు చక్రాల వాహనాలు-20వేల 559
రోడ్లపైనే వాహనాలు:
సుమారు 2 లక్షల 70 వేల వాహనాలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని వాహనాలు నగరంలో ఉన్నప్పుడు పార్కింగ్ స్థలాలు ఎన్ని ఉండాలో ఆలోచన రావడం సహజం. కానీ నగరంలో ఒక్కటంటే.. ఒక్కటి కూడా కార్పొరేషన్‌కు సంబంధించిన పార్కింగ్ స్థలం లేకపోవడం విశేషం. ఒక్క ఆర్టీసీ బస్టాండ్‌లో తప్ప నగరంలో ఎక్కడ కూడా చెల్లింపు పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలన్నీ రోడ్లపైనే నిలుపుతున్నారు.
తీవ్రతరమవుతున్న ట్రాఫిక్:
నగర పరిధిలోని టవర్ సర్కిల్, ప్రధాన కూరగాయల మార్కెట్ వైపు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఉండటం వల్ల రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య వేలల్లో ఉంటుంది. వీరంతా ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లపై ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండగా.. ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.
పార్కింగ్ లేదు... చలాన్ ఎందుకు?
పండుగల సమయంలో ఈ ప్రాంతాల్లో వాహనాలపై ప్రయాణం చేయడమే గగనమవుతోంది. నగరంలో రహదారులు భవనాల శాఖ పరిధిలోని 14.5 కిలోమీటర్ల మేర పొడవుగా ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా పార్కింగ్ స్థలాలు ఎక్కడాలేవు. తాజాగా జిల్లాలో ఈ-చలాన్ విధానం అమల్లోకి వచ్చింది. పార్కింగ్ సదుపాయాల గురించి పట్టించుకోని పోలీసులు రాంగ్ పార్కింగ్ అంటూ.. ఫోటోలు తీస్తూ... ఈ-చలాన్ పంపించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కారిస్తాం:
శిరస్త్రాణం ధరించకపోవడం.. రాంగ్‌రూట్లో ప్రయాణం... నోపార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపారంటూ ఈ-చలాన్లు పంపుతున్నారు. కొత్తగా విధుల్లోకి చేరిన నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పోలీసులు నో పార్కింగ్ అంటూ చలాన్లు విధించే ముందు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ' సుమారు 3నెలల్లో పూర్తి స్థాయి ఫీజులు ఖరారుచేస్తాం'