Crops Dried in Choppadandi : ఆమడ దూరం నుంచి వందల టీఎంసీల నీరు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నా తమ పంటలకు మాత్రం అందడం లేదన్న ఆవేదన కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుల్లో కనిపిస్తోంది. గడిచిన అయిదేళ్లుగా రెండుపంటలకు నారాయణపూర్, గంగాధర చెరువులను నింపి అక్కడి నుంచి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని ఆయా మండలాలకు సాగునీటిని సరఫరా చేసేవారు. నందిమేడారం జలాశయం నుంచి గంగాధర, నారాయణపూర్ చెరువులకు రెండు పైపులైన్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఆ నీటిపై ఆశలతో పంటలు వేసిన రైతులకు నిరాశ మిగులుతోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లిలో పైపులు మరమ్మతులకు గురవడంతో యాసంగిలో నీటి విడుదల నిలిచిపోయి పంటలు ఎండిపోతున్నాయి. ఏటా జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నీరు విడుదల చేస్తుండగా.. ఈ సారి ఆలస్యం కావడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
వేల ఎకరాల్లో ఎండిన పంట..
Paddy Crop Dried in Choppadandi : నీటి కొరత కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. ఇంకో వారం వరకు నీరు అందక పోతే పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి వ్యవసాయ బావుల్లో పూడికమట్టిని తొలగిస్తున్నారు. అయినా నీటి ఊటలు రావడం లేదు. నారాయణపూర్ చెరువులో ఆయా గ్రామాలకు చెందిన రైతులు కాల్వలు తవ్వి నీటిని తరలించుకుంటున్నారు. ఎండిపోతున్న పంట పొలాల సమీపంలోనే ఉండే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాత్రం తమ బాధను పట్టించుకోవడం లేదని రైతుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఆశ అడియాశలైంది..
Paddy Crop Dried in Karimnagar : "పుష్కలంగా నీళ్లున్నాయనే ఆశతో 18 ఎకరాల్లో వరి పంట వేశాను. పైపులు పగిలి నీళ్లు వస్తలేవు. 18 ఎకరాల్లోని పంటంతా ఎండిపోయింది. మరో వారంలోపు నీళ్లు రాకపోతే పంట మొత్తం ఎండిపోయి చాలా నష్టపోతాం."
- చొప్పదండి రైతు
ఎమ్మెల్యేకు చెప్పినా.. పట్టించుకుంటలేరు..
Crops Dried in Karimnagar : "నిరుడు పుష్కలంగా నీళ్లు వచ్చినయని.. ఈ ఏడాది కూడా ఆశతో పంట వేశాం. పైపులైను పగిలిందట ఎక్కడ్నో. నెల రోజుల నుంచి నీళ్లు వస్తలేవు. పంటంతా ఎండిపోయింది. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేస్తే మిగిలిన పంట అన్నా దక్కుద్ది. లేకపోతే పంట మొత్తం ఎండిపోయి మేం రోడ్డున పడుతం. మా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఈ ముచ్చట చెప్పినం. ఆయన కూడా పట్టించుకుంట లేరు. ఏం చేయాల్నో అర్థం అవుతలేదు. నీళ్లు లేక ఇన్నేళ్లు ఇబ్బంది పడ్డం. ఇప్పుడేమో నీళ్లున్నా కష్టాలు తప్పుతలేవు."
- మహిళా రైతు
ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన కాస్త పంట కాపాడుకుంటామని రైతులు వేడుకుంటున్నారు.