Crops Damaged Due to Hail Rains in Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత నెల 18 నుంచి రెండ్రోజుల పాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినగా.. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 23 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 10 వేల ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు అంచనా వేశారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను గత నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వర్షాలకు నేలకొరిగిన పంటలను సీఎం పరిశీలిస్తారని.. దెబ్బతిన్న పంటల ఆనవాళ్లు చెరిగిపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ భరోసా తర్వాత వ్యవసాయ అధికారులు పంటల వివరాలు నమోదు చేస్తారని రైతులు ఎదురుచూశారు. వర్షాల ప్రభావంతో అప్పటికప్పుడే జరిగిన నష్టంతో పాటు.. ఆ తర్వాత మిగిలిన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు.
పరిహారంపై రాని స్పష్టత.. ఆవేదన చెందుతున్న రైతులు: వరి పంటపై వడగళ్లు పడినప్పుడు అప్పటికప్పుడు పెద్దగా నష్టం కనిపించకపోయినా.. క్రమంగా వరి గొలుసులు పూర్తిగా నేల రాలిపోయినట్లు వివరిస్తున్నారు. వరి గొలుసులు నల్లగా మారిపోగా.. మిగిలిన మామిడికాయలను సైతం అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికీ మామిడి కాయలతో పాటు పుచ్చకాయ, మస్క్‌మిలన్ తదితర కాయలను చెట్లపైనే వదిలేసినట్లు వాపోతున్నారు. నష్టపోయిన పంటల వివరాలు ఏ మేర నమోదు చేశారు.. పరిహారం ఎంత వరకు వస్తుందనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదని వాపోతున్నారు.
450 ఎకరాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం: గత నెలలో కురిసిన అకాల వర్షాలకు గంగాధర మండలంలో 6 వేల ఎకరాల్లో వరి, 450 ఎకరాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 100 ఎకరాల్లో కూరగాయల తోటలు పూర్తిగా పాడైపోయాయి. కరీంనగర్ జిల్లాలో 14 వేల 287 మంది రైతులకు చెందిన 23 వేల 116 ఎకరాల్లో.. పెద్దపల్లి జిల్లాలో పాక్షికంతో పాటు 33 శాతానికి పైగా 7 వేల 174 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తద్వారా 4 వేల 79 మంది రైతులు నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 165 మంది రైతులకు చెందిన 76.19 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.
ప్రకటన ఊరటనిచ్చినా.. ఆశల్లేకుండా చేస్తున్న నిబంధనలు: జిల్లాలోని రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నమోదు చేసుకున్నా.. పరిహారం విషయంలో స్పష్టత లేకపోవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నష్టపోయి ఆందోళన చెందుతున్న వేళ సర్కార్ పరిహారం ప్రకటన కాస్త ఊరటనిచ్చినా.. దీనికి విధించిన నిబంధనలే ఆశల్లేకుండా చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అధికారులు నమోదు చేసిన వివరాలతో ఏ మేరకు పరిహారం వస్తుందో ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
ఇవీ చదవండి: