కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వరుస ఘటనలు చేసుకుంటున్నాయి. తాజాగా జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ నవజాత శిశువు పుట్టిన కాసేపటికే చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది. మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన నిండు గర్భిణీ రేష్మ భర్త షారుక్‌తో కలిసి ప్రసవం నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎంతసేపటికీ వైద్యులు స్పందించలేదు. నొప్పులు ఎక్కువగా రావడంతో... చికిత్స చేయమని కుటుంబ సభ్యులు వైద్యులను బతిమాలారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లిన రేష్మకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు.
పుట్టిన కాసేపటికే బాబు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ... ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న రెండవ పట్టణ సీఐ లక్ష్మీ బాబు, ఎస్సై తోట మహేందర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాని బంధువులకు నచ్చజెప్పారు. శిశువు పుట్టిన కాసేపటికే.. గుండెపోటు వచ్చిందని, అందువల్లే బాబు చనిపోయాడని ఆస్పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ రత్నమాల తెలిపారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరికి చేయాల్సిన శస్త్రచికిత్స మరొకరి చేయడంతో ఆస్పత్రిలో ఆందోళనలు రేకెత్తాయి.
ఇదీ చూడండి: డెల్టా రకంపై కొవాగ్జిన్, కొవిషీల్డ్ భేష్