మొలంగూర్ ఖిల్లాకు కొత్త కళ మొలంగూర్ ఖిల్లాకు కొత్త కళఒకవైపు కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35కిలోమీటర్ల దూరంలో, మరోవైపు వరంగల్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది మొలంగూర్ ఖిల్లా. ఎలగందుల, కాకతీయుల కోటల మధ్యలో ఈ ఖిల్లా ఉంటుంది. దీని నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోక.. శిథిలమైపోతున్న వేళ.. అధికారులు దృష్టిసారించారు. మరమ్మతులు చేపట్టి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కోటకు కొత్తశోభ సంతరించుకుంటోంది. రెండుగుట్టల మధ్య ఉన్న ఈ కోటకు తూర్పు పడమరల్లో రెండు ద్వారాలున్నాయి. కొంతదూరం వరకు పైకి ఎక్కడానికి రాతిమెట్లు ఉన్నా.. ఆ తర్వాత పైకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేదు. ఎంతో ఖ్యాతి ఉన్న మొలంగూరు కోటను పట్టించుకునే వారు లేక... తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోటను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కోటల మాదిరిగా దీనిని పర్యటక కేంద్రంగా మార్చారు. కోట పైభాగంలో చుట్టూ ప్రహరీగోడతో పాటు మరఫిరంగులు, ట్రెకింగ్‌కు వీలు కల్పించే విధంగా గుట్టలున్నాయి. సాహస క్రీడలు నేర్చుకోడానికి వీలుగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారు. ఈ ఖిల్లా దిగువన ఓ దూద్ బావి ఉంది. అందులోని నీరు స్వచ్ఛగా ఉంటాయని, వేసవిలోనూ నిండుగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయుర్వేద గుణాలున్న ఈ బావి నీటిని తీసుకెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక కోట శిథిలమౌతున్న వేళ... ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడమే కాకుండా పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.