రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఈ నెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని షెడ్యూల్ట్ కులాల సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈ చరిత్రాత్మకమైన సభకు లక్షా 20వేల మంది హాజరవుతారని, ఇందులో ఎక్కువ సంఖ్యలో దళితులే ఉంటారని చెప్పారు. సభ జరిగే మైదానాన్ని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు గాను చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన చర్యల గురించి జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
825 బస్సుల్లో..
సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి కొప్పుల అన్నారు. సభకు 825 బస్సుల్లో దళితులు వస్తారని చెప్పిన మంత్రి.. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. సభానంతరం వారికి భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు. సభకు దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరవుతారని చెప్పారు.
ఈ ఏడాది 12వేల కుటుంబాలకు..
సభలో అర్హులైన 2 వేల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున చెక్కులు అందజేస్తామని.. మరుసటి రోజు నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20వేల కుటుంబాలకు అందిస్తామని మంత్రి కొప్పుల వివరించారు. ఈ పథకానికి సంబంధించి కేసీఆర్ రూ. 2వేల కోట్లు ప్రకటించారని చెప్పిన కొప్పుల.. నియోజకవర్గానికి రూ. 500 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పథకాన్ని ఉద్యమం మాదిరిగా రాష్ట్రమంతా అమలు చేస్తామని.. అందుకు సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున 12 వేల కుటుంబాలకు, అటు తర్వాత అందరికీ అందజేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: ERRABELLI: సొంత స్థలాలు ఉంటే.. ఈ ఏడాది నుంచే ఇళ్లు కట్టిస్తాం