ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశంలోనే మొదటిసారి యుద్దవిమానాలను మన రాష్ట్రం వినియోగిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌తో పాటుగా ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
కోవిడ్ రోగులను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రాల్లోనే ఆక్సిజన్, వెంటిలేటర్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ఆక్సిజన్ కొరత ఉందన్న ఆయన... ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. దగ్గర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కాకుండా 1,300 కిమీల దూరాన ఉన్న ఒడిశా నుంచి కేంద్రం ఆక్సిజన్‌ను కేటాయించడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
రోడ్డు మార్గాన ట్యాంకర్లను పంపిస్తే ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో యుద్ద విమానాలను అద్దెకు తీసుకొని ఖాళీట్యాంకర్లను ఒడిశాకు తరలిస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. అందువల్ల కనీసం రెండుమూడు రోజుల సమయం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: 'కేంద్ర వివక్షను అర్థం చేసుకుని.. తెరాసనే గెలిపించాలి'