కుంభవృష్టి కురిసినా శాలపల్లిలో దళితబంధు సభ జరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(HARISH RAO) స్పష్టం చేశారు. ప్రజలంతా మధ్యాహ్నం ఒంటిగంట వరకు సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. సభను కుండపోత వర్షం సైతం ఆపలేదని ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో తెలిపారు.
దళితబంధు(Dalitha Bandhu) పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు నేడు సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణంలోకి, రోడ్ల మీదకు వర్షపు నీరు చేరింది. వేదిక వద్దకు చేరుకునే దారి బురదమయంగా మారింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది గుంతలమయమైన రహదారులను సరి చేస్తున్నారు. కంకర నింపుతూ మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు.
హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాలు, దళిత కాలనీల్లోకి ఇప్పటికే బస్సులు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాలపల్లి దళితబంధు సభకు తరలిరావాలని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఇవాళ ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కోరారు.
జర్మనీ సాంకేతికతతో సీఎం కేసీఆర్ సభ ప్రాంగణం ఏర్పట్లు జరిగాయి. ప్రస్తుతం వర్షం పడే పరిస్థితులు లేవు. ఒకవేళ కుంభవృష్టి కురిసినా సభ జరుగుతుంది. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లక్ష మందికి పైగా ప్రజలు వస్తున్నారు. 15 మందికి సీఎం కేసీఆర్ దళితబంధు అందజేస్తారు. మిగతా 20వేల కుటుంబాల్లో అర్హులను ఎంపిక చేస్తాం.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
దళిత బంధు పథకం నేటి నుంచి ప్రారంభం కానుండగా ఎస్సీ(SC) కాలనీల్లో పండగ వాతావరణం నెలకొంది. పథకం ప్రారంభానికి వస్తున్న సీఎం కేసీఆర్(CM KCR)కు మహిళలు రంగవళ్లులతో ఆహ్వానం పలుకుతూ ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: శాలపల్లి వేదికగా నేడు దళితబంధు ప్రారంభోత్సవం