మెదక్‌లో చెల్లని రూపాయి హుజూరాబాద్‌లో చెల్లుతుందా అని సినీనటి, భాజపా నేత విజయశాంతిపై మంత్రి హరీశ్ రావు సెటైర్ విసిరారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో.. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా హరీశ్ ప్రచారం నిర్వహించారు.
మెదక్ ఎంపీగా విజయశాంతి గెలవడానికి తానే కారణమని హరీశ్ అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 6 నియోజకవర్గాల్లో ఆమెకు మెజారిటీ రాలేదని.. సిద్దిపేటలో 70వేల మెజారిటీ తెప్పించానని పేర్కొన్నారు. కేవలం 3వేల ఓట్లపై ప్రత్యర్థిపై గెలిశారని ఎద్దేవా చేసారు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
సిద్దిపేటలో విజయశాంతిని నేనే ఎంపీ చేసిన. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆమెనే గెలవలేదు కానీ ఈటల రాజేందర్‌ను గెలిపిస్తరా.? విజయశాంతి చెబితే ఓట్లు వేస్తరా.! సినిమా యాక్టర్లు డైలాగులు చెబితే చప్పట్లు కొడతం కానీ.. ఓట్లేస్తమా.? - హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి
చల్లూరు సీతారామచంద్ర స్వామి సాక్షిగా చల్లూరును మండల కేంద్రం చేస్తానని హరీశ్ హామీ ఇచ్చారు. చల్లూరును మండల కేంద్రం చేయాలని గతంలో దీక్షలు చేసి ఆందోళనలు చేసినా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని ఆరోపించారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే తప్పకుండా మండలం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్