ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అడగక ముందే మూడుసార్లు అంగన్‌వాడీ ఉపాధ్యాయుల జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harishrao) కొనియాడారు. గత పాలకులు అంగన్‌వాడీ టీచర్ల జీతాల పెంపుపై తీవ్ర నిర్లక్ష్యం చూపేవారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్ హాల్‌లో టీఎన్‌జీవోల అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CmKcr)కు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సభకు హరీశ్‌తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800లు చెల్లిస్తున్నారని... కానీ తెలంగాణలో రూ.13,650లు చెల్లిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అంగన్‌వాడీ టీచర్ల జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు భాజపా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని, సబ్సిడీలు తగ్గిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మిని అపహాస్యం చేసిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసన్నారు. ఈ ప్రభుత్వ పథకాలు వద్దా అని మంత్రి ప్రశ్నించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 4,000 రెండు పడకలు గదులు మంజూరు చేస్తే ఇక్కడ ఏడేళ్లుగా పని చేసిన మంత్రి ఒక్క ఇల్లు కూడ పూర్తి చేసి గృహాప్రవేశం చేయించలేదన్నారు. ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ముందుకు నడిపిస్తుందన్నారు. అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తే... ముళ్ల కంచెలు పెట్టి గుర్రాలతోటి తొక్కించిన ఘనత గత పాలకులది. కానీ ప్రగతిభవన్‌కు మిమ్మల్ని పిలిచి ప్రేమగా పలకరించి బుక్కెడు బువ్వ పెట్టి మీరు అడగకముందే జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. సీఎం కేసీఆర్... ఏడేళ్లలో మూడుసార్లు మీ జీతం పెంచారు. భారతదేశ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచింది కేసీఆర్ మాత్రమే. అందరూ వద్దంటున్న ముఖ్యమంత్రి పట్టుబట్టి మరీ మీ జీతాలు పెంచారు. మరి అటువంటి ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.
-- హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చూడండి: SABITHA INDRA REDDY: విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం