మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరు వల్ల స్థానిక సంస్థల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్‌లో నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్‌లతో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నికల ఫలితాలు ఎప్పుడు రాలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందని గంగుల పేర్కొన్నారు.
కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు..
తెరాసలో సింగిల్ లీడర్ షిప్ వల్ల అనుకూల ఫలితాలు వచ్చినట్లు మంత్రి గంగుల తెలిపారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతయిందన్నారు. అధికార పార్టీపై కోపంతో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని విమర్శించారు. రాబోయే 40ఏళ్లు తెలంగాణలో తెరాస పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు.