ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 13 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిన దృష్ట్యా నివారణ చర్యలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని గంగుల కోరారు.
ఇండోనేషియాకు చెందిన బృందం 48 గంటల పాటు కలెక్టరేట్ ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలతో పాటు పలు హోటళ్లలో పర్యటించినట్లు గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టరేట్ నుంచి మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య సిబ్బందితో 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఇంటింటా పరీక్షలు నిర్వహించాలంటే అందరూ ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు.
మెడికల్ షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాల మినహా అన్నింటినీ స్వచ్చందంగా మూసివేయాలని కలెక్టర్ శశాంక కోరారు. సాధ్యమైనంత వరకు ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని, పెళ్లిళ్లు, శుభ కార్యాలను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని కలెక్టర్ శశాంక సూచించారు. ప్రజలు ఇళ్లలో ఉండటం సామాజిక బాధ్యతగా భావించి సహకరిస్తేనే కరీంనగర్‌ను సురక్షిత నగరంగా చూడగలుగుతామని కలెక్టర్ శశాంక వివరించారు.
ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంలోని కరోనా సోకిన వ్యక్తి ఈనెల 14న కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంతంలో పలువురిని కలిసినట్లు అధికారులు గుర్తించారు.
కలెక్టరేట్ పరిసరాల్లో అన్ని దుకాణాలను మూసివేయించారు. కరోనా సోకిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. వారిలో ఎనిమిది మందిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విదేశాల నుంచి ఎవరు వచ్చారనే సమాచారాన్ని సేకరించేందుకు వచ్చిన కానిస్టేబుల్‌తో పాటు, జ్వరంతో ఉన్న కారణంగా వైద్యం చేసిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని పరీక్షల నిమిత్తం తరలించారు. నిరంతరం రద్దీగా ఉండే కలెక్టరేట్ ప్రాంతంలోని హోటళ్లు, జిరాక్స్ సెంటర్లు, ఇతర దుకాణాలను మూసివేయించారు.
ఈ సందర్బంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: రేపు కరోనాపై సీఎం అత్యున్నతస్థాయి సమావేశం