దిల్లీ రైతుల ఉద్యమానికి తెలంగాణ అన్నదాతల మద్దతు ఉందని... ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకంతోనే ఇక్కడి రైతులు మౌనంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మల్యాల క్లస్టర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. దిల్లీ ఎముకలు కొరికే చలిలో రైతుల కష్టాలు ఎలా ఉన్నా మన రాష్ట్రంలో మాకు ఏమీ కాదని రైతుల్లో విశ్వాసం కనిపిస్తోందని ఈటల పేర్కొన్నారు. కానీ కేంద్ర నిర్ణయాలతో కొంత ప్రమాదం పొంచి ఉందని రైతులు గమనించాల్సిన అవసరముందన్నారు.
ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్లీ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, రైతు బంధు పథకాలతో ఆత్మహత్యలు ఆగిపోయిన క్రమంలో కేంద్ర నిర్ణయం రైతులను మళ్లీ అభద్రతలోకి నెట్టి వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రైతుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ దేశంలో వ్యవసాయమే జీవమనే విషయాన్ని పాలకులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సొంత స్థలం ఉంటే రెండు పడక గదులు నిర్మాణం చేసేందుకు వీలుగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు రేషన్‌కార్డులు, పెన్షన్లపై ఆలోచిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: సీపీ అంజనీకుమార్