తెలంగాణ దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా మారబోతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ఏర్పాటు చేసిన రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి ప్రారంభించారు.
త్వరలోనే రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఈటల పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సమీక్షలు జరిపారని తెలిపారు.
ఈ సందర్భంగా దేశంలో ఎఫ్‌సీఐ 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. అందులో మన రాష్ట్రం 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించిందని మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలకు కావాల్సినంత నీరు లభిస్తుందని.. ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తగా ఆలోచించి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలనూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్స్ కనుమల్ల విజయ, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాస అనేది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష : హరీశ్ రావు