మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి లొంగుబాటు అంత సులువు కాదని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. మావోయిస్టు ఉద్యమంలో 17 ఏళ్లపాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేయడంతోపాటు గణపతి, ఇతర అగ్రనేతలతో సన్నిహితంగా మెలిగి రెండేళ్ల క్రితం లొంగిపోయిన ఆయన బుధవారం ‘ఈనాడు’తో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. ‘‘ఉద్యమంలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేసిన గణపతి అనారోగ్య కారణాలతో లొంగిపోతారని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కీలక నేతలు అనారోగ్యంగా ఉన్నా కేంద్ర కమిటీ అన్నీ చూసుకుంటుంది.
తీవ్ర అనారోగ్యం పాలై నడవలేని స్థితిలోగానీ, ప్రాణాపాయ స్థితిలోగానీ ఉంటే మాత్రమే బయటికి పంపించేందుకు పార్టీ ఆలోచిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ సభ్యురాలికి కరోనా సోకితే కేంద్ర కమిటీలో కచ్చితమైన నిర్ణయం జరిగిన తర్వాతే ఆమె సరైన మార్గంలో లొంగిపోవడానికి పార్టీ చర్యలు తీసుకుంది.
నేను పార్టీ విధానాల్ని వ్యతిరేకించినా.. నా లొంగుబాటుకు పార్టీ సహకరించింది. మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నాకున్న సమాచారం మేరకు ఆరా తీశా. గణపతి లొంగుబాటు గురించిన సమాచారం లభించలేదు. గతంలో కొండపల్లి సీతారామయ్య అజ్ఞాతంలో ఉండగానే పార్కిన్సన్ వ్యాధికి గురయ్యారు.
ఆ సమయంలో పీపుల్స్‌వార్ పార్టీ ఆయన్ను పట్టణంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి చికిత్స చేయించింది. అలాంటిది మావోయిస్టు పార్టీకి మూలస్తంభంలాంటి గణపతిని వదులుకుంటుందని అనుకోను. 2017లో గణపతి వయోభారంతోనే కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయనపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారనేది అబద్ధం’’ అన్నారు.
అగ్రనేతలు లొంగిపోతారనడం ఆధారరహితం
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి, కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తదితర అగ్రనేతలు లొంగిపోతారంటూ జరుగుతున్న ప్రచారం ఆధారరహితం. మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతల మూకుమ్మడి లొంగుబాట్లు అసంభవం. పార్టీలో ఆంధ్ర, తెలంగాణ నేతల మధ్య విబేధాలు ఉన్నాయనేదీ అపోహే.
ఫిలిప్పీన్స్ పర్యటన అబద్ధం
గణపతి కొన్నేళ్ల క్రితం ఫిలిప్సీన్ వెళ్లారనేది అబద్ధం. పార్టీ తరఫున అంతర్జాతీయ స్థాయి వ్యవహారాలను నెరపడం వరకు నిజమే. అయితే ఉద్యమ కార్యకలాపాల విస్తరణ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదు. అనారోగ్యం తలెత్తినప్పటి నుంచి పార్టీ రక్షణలోనే ఉండిపోయారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం..