వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. పెళ్లై సంవత్సరం కూడా గడవకుండానే... నిండు జీవితానికి స్వస్తి పలికింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్ధన్నపేటకు చెందిన జాడ అనూష(21)... శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తిమ్మాపూర్లోని వాసుదేవ మహిళ వసతి గృహంలో ఉంటోంది. రోజూలాగానే కళాశాల నుంచి వసతి గృహానికి వచ్చిన అనూష... బాత్రూం వద్ద ఉరేసుకొని విగతజీవిగా కన్పించింది. గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనూష మృతిపై ఆరా తీశారు.కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి భర్త ఆది మల్లేశంతో పాటు అత్తింటివారు అదనపు కట్నం తీసుకురావాలని... నెల నుంచి వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.