Manair river front works in Karimnagar : మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా చేపడుతున్న పేలుళ్లకు కరీంనగర్ శివారు కాలనీల వాసులు బెంబేలెత్తుతున్నారు. రాళ్లను తొలగించేందుకు చేస్తున్న పేలుళ్లతో తమ భవనాల పెచ్చులు ఊడిపడుతున్నాయని భయపడుతున్నారు. పేలుళ్ల తీవ్రత కిలోమీటరు దూరంలో ఉన్న వారికి సైతం ఇబ్బందిగా మారింది. దాదాపు రూ.308 కోట్లలతో నిర్మాణ పనులు జరుగుతుండగా పేలుళ్ల విషయంలో కనీస నిబంధనలు పాటించట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిలెటిన్ స్టిక్స్ వాడకం వల్ల స్థానికులకు ఆందోళన: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, బైపాస్ రోడ్డులో పేలుళ్ల ప్రకంపనలకు పలు శ్లాబులకు పెచ్చులూడి పడుతున్నాయి. ఎన్నడూ లేనిది అకస్మాత్తుగా ఎందుకు పగుళ్లు వస్తున్నాయని ఆరా తీసిన స్థానికులు మానేరు అభివృద్ధి పనులే కారణమని గుర్తించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు సకాలంలో పూర్తి చేసేందుకు వేగం పెంచి రాత్రింబవళ్లు చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మాణం కోసం రాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడకం సమీప వాసుల ఆందోళనకు కారణమవుతోంది. అలుగునూర్ ప్రాంతంలో ప్రహారీలకు పగుళ్లు, దుకాణాల అద్దాలు ధ్వంసం అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
రాళ్లు పేలినప్పుడు వచ్చే ప్రకంపనాలతో ఇబ్బంది: రూ.308 కోట్లలతో కరీంనగర్‌లో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో ప్రస్తుతం ప్లాట్‌ఫాం పనులు జరుగుతున్నాయి. దాదాపు 3మీటర్ల లోతుతో రెండున్నర కిలోమీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మాణం చేపడుతున్నారు. మానేరు వాగులో ఇసుక తొలగించగా వచ్చిన రాళ్లను అనుమతి తీసుకొని జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చుతున్నారు. అవి పేలినప్పుడు భారీ శబ్దంతో పాటు చాలా దూరం వరకు వస్తున్న ప్రకంపనలతో స్థానికుల్లో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదం జరిగే వీలుంది: అర్ధరాత్రి జరుపుతున్న పేలుళ్ల వల్ల నిద్రపోతున్న సమయంలో పెచ్చులూడుతాయేమోనని భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.పేలుళ్ల వల్ల ఆస్తుల ధ్వంసంతో పాటు, ప్రమాదానికి ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెచ్చులూడుతన్న విషయం దృష్టికి రాలేదన్న అధికారులు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
"రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నప్పుడు మా ఇంట్లో వైబ్రేషన్‌కి పెచ్చులు వస్తున్నాయి. రివర్ ఫ్రంట్‌కి దగ్గరిలో మైనారిటీ పాఠశాల ఉన్నది. అందులో షీలింగ్కి బేటలు పడుతున్నాయి. నిర్మాణ పనులు అధిక శబ్దం లేకుండా చేస్తే అందరికి మంచిది. నిర్మంచే బ్రిడ్జికైనా, మా సమస్యలైనా భద్రతకు భంగం కలగకుండా పనులు చేయాలని నా ఉద్దేశం."-శ్రీధర్‌రెడ్డి, బేకరి యజమాని
ఇవీ చదవండి: