రైతుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట పరిధిలో డీ8 వన్ఎల్ ఉప కాల్వ నిర్వాసితులకు రూ.1.58 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకం..
వ్యవసాయాన్ని దేశానికే మార్గదర్శకంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రసమయి పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంనదన్నారు. ఇందులో భాగంగానే జలాశయాల నిర్మాణం చేపట్టి చెరువులు కుంటలను అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.
సహకరించినందుకు ధన్యవాదాలు..
కాల్వ నిర్మాణానికి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం అభివృద్ధి పనులను పర్యవేక్షించి రైతు వేదిక నిర్మాణ పనులను నాణ్యతతో శరవేగంగా పూర్తి చేయాలని సర్పంచ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి , తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ గంప మల్లీశ్వరి, డైరెక్టర్ వెంకన్న, భూ నిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.