లాక్‌డౌన్‌తో రెక్కాడితే కాని డొక్కాడని ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. కరీంనగర్ టవర్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో మూసి ఉన్న దుకాణాల ముందు అడ్డాకూలీలు.. తినడానికి తిండిలేక, చేయడానికి పనులు లేక విలవిల్లాడుతూ కనిపిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ మినహాయింపు ఉండటంతో... వివిధ గ్రామాల నుంచి 5గంటలకే బయలు దేరి కూలీ పనుల కోసం తరలి వస్తున్నారు.
ఆశగా పనుల కోసం..
పది గంటల వరకు ఏదైనా పని దొరక్కపోతుందా అని కూలీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా కారణంగా పనులన్నీ నిలిచిపోవడ వల్ల ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చివరి ఘడియ వరకు పనుల కోసం వేచి ఉన్న కూలీలు... ఆటోలు అందుబాటులో లేక రోడ్ల పక్కనే నిద్రించే పరిస్థితి నెలకొంటోంది. ఇంటికి వెళ్లి ఇబ్బంది పడేకంటే ఇక్కడే రోడ్డు పక్కన పడుకుంటున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
దాదాపు ఏడాది కాలంగా పరిస్థితి దయనీయంగా మారిందని అడ్డా కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత లాక్‌డౌన్ వేళ పేదలు, కూలీలకు చాలా మంది నిత్యావసర సరుకులు ఇచ్చేవారని.. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదని కూలీలు వాపోతున్నారు. లాక్‌డౌన్ డబ్బున్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తీసుకురాకపోయినా... పూట గడవలేని తమలాంటి వారి పరిస్థితిని మాత్రం దయనీయంగా మార్చిందని కూలీలు వాపోతున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం