కరీంనగర్ జిల్లా హూజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ బృందం పర్యటించింది. ధాన్యం నిల్వలను పరిశీలించిన బృందం వివరాలను ఆరా తీసింది. రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక బస్తాకు అదనంగా రెండు కిలోలు, తాలు పేరుతో మరో రెండు కిలోలు కోత విధిస్తూ రైతు నడ్డి విరుస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రులు రైస్‌మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు, హమాలీ కార్మికులకు చెల్లించాల్సిన కమిషన్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నేటికీ ఖాతాలకు బదిలీ చేయలేదు...
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జనవరి మాసంలోనే కందులు కొనుగోలు జరిపినప్పటికీ నేటికీ ఏ ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేయలేదన్నారు. పలు కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు లేక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరువాలన్నారు. రాజకీయాలు చేయటానికి ఇక్కడికి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. రైతుల వెన్నంటే ఉంటామన్నారు.
ఇవీ చూడండి : మందుబాబులను చితకబాదిన మహిళ