Karimnagar, Telangana Assembly Elections Result 2023 Live : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మెుదలైంది. పదేళ్లుగా కనీసం ప్రతిపక్షంలో కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. మెుదటి నుంచి అన్ని సర్వే అంచనాలను నిజం చేస్తూ రాష్ట్రంలో క్లియర్ కట్ మెజార్టీతో కాంగ్రెస్ దూసుకొచ్చింది. అధికార బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అధికారమే లక్ష్యంగా అడ్డంకుల్ని అధిగమించి అధికారానికి దగ్గరైంది. వ్యూహాత్మక ఎత్తుగడలు, నేతల ఐక్యతతో తెలంగాణను హస్తగతం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 నియోజకవర్గాల్లో గెలిచింది. బీఆర్ఎస్ ఐదు నియోజకవర్గాలకే పరిమితమైంది.
Karimnagar, Telangana Assembly Elections Result 2023 Live : రాష్ట్రావిర్భావం అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనే కాకుండా ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నికల్లో కారుకు జైకొట్టిన ఉమ్మడి కరీంనగర్ ప్రజానీకం.. ఈ ఎన్నికల్లో మాత్రం విభిన్నతీర్పునిచ్చింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో 2014లో 12 స్థానాలను, 2018లో 11 నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో మంథనిలో మాత్రమే గెలుపొందిన హస్తం పార్టీ.. ఈ సారి 8 నియోజకవర్గాలను కొల్లగొట్టింది. బీఆర్ఎస్ ఐదు నియోజకవర్గాలకే పరిమితమైంది.
KTR, Telangana Election Result Live 2023 : కరీంనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై స్వల్ప మెజార్టీతో గెలిపొందడంతో ఆ నియోజకవర్గంలో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ కోరింది. చివరకు అధికారులు గంగుల కమలాకర్ 3284 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారకరామారావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 29,687 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. కేటీఆర్ మెజార్టీ గతంలో కంటే తగ్గినా వరుసగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదోసారి విజయం సాధించారు. హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్ కూాడా కారు గుర్తుపై విజయం సాధించారు.
karimnagar Assembly Results news Live : కాంగ్రెస్ నుంచి రామగుండం నియోజకవర్గంలో రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ విజయం సాధించారు. పెద్దపల్లిలో విజయ రమణారావు, వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్, మంథని నియోజకవర్గంలో మరోసారి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గెలుపొందారు. చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హూస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించారు.