లాక్‌డౌన్ సమయాన్ని కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ సమర్థంగా వినియోగించుకుంటోంది. రద్దీ లేని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. స్మార్ట్ సిటీ (Smart city)పనులు వేగంగా చేపడుతున్నారు. క్రీడా ప్రాంగణం, పార్కులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులే కాకుండా టవర్ సర్కిల్ రీడిజైనింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సాధారణ రోజుల్లో అయితే నిర్మాణపు పనులు చేపట్టడానికి అనేక అవాంతరాలు ఉండేవని... ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. కూలీల ఇబ్బంది రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్న అధికారులు... వారికి అన్ని వసతులు కల్పిస్తూ పనులు పూర్తిచేస్తున్నారు.
రూ. 326 కోట్లతో...
నగరంలోని ఆదర్శనగర్‌తో పాటు సవారన్ స్ట్రీట్, శాతవాహన వర్సిటీ, మహిళా డిగ్రీ కళాశాల, కశ్మీర్ గడ్డ, శాలిమార్ రోడ్డులో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం రూ. 326 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో నిర్మాణాలు పూర్తిచేస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. పనులు వేగంగా పూర్తవుతున్నప్పటికీ నాణ్యత లోపం లేకుండా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Tamilisai: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్