Ravinder singh on CM KCR: సహచర ఉద్యమకారునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పర్యాయాలు పిలిచారని అందువల్లే వెళ్లాల్సి వచ్చిందని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తనను సీఎం ఆహ్వానించారని.. మూడు రోజుల క్రితం మరోసారి ఆహ్వానించడంతో వెళ్లి కలవాల్సి వచ్చిందని కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో వివరించినట్లు తెలిపారు. తాను ఏనాడు భాజపా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు యత్నించలేదని.. బీఎస్పీ ,కాంగ్రెస్ నుంచి మాత్రం తనకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.
ఇతర వివరాలేవీ చర్చించలేదు..
తాను ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్‌తో పాటు జీవన్‌రెడ్డి ఇతర నాయకులందరినీ కలిసి ఓట్లకోసం అడిగానే తప్ప ఇతర వివరాలు చర్చించలేదని చెప్పారు. ఉద్యమకారునిగా తనతో కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు రవీందర్ సింగ్ వివరించారు. తనకు భాజపాకు వెళ్లడానికి దారులు మూసుకుపోయాయని కొందరు పేపర్లలో రాశారని.. అలాంటివేమి జరగలేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపించిందని సీఎంకు ఫిర్యాదు చేశానని.. అవసరమైతే పోరాటం కొనసాగిస్తానని రవీందర్ సింగ్ వివరించారు.
మనస్తాపానికి గురై పోటీ చేశా..
'ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వకపోవడంతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేశా. బీఫామ్ ఇస్తానని ముఖ్యమంత్రి మాట ఇవ్వడంతోనే పోటీలో ఉన్నా. తీరా సమయానికి బీఫామ్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నారు. తెలంగాణ ఉద్యమంలో సహచర ఉద్యమకారుల బాగోగులపై అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారుల లిస్టు తయారుచేసి తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఉద్యమం నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు తన వెంటే ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సీఎం చెప్పారు.'
-రవీందర్ సింగ్, కరీంనగర్ మాజీ మేయర్
ఇదీ చదవండి: