మధ్యాహ్నం భోజనం చేయడానికని బాక్సు మూత తీశాను. ఓ బొంతపురుగు అన్నంలో పడింది. ఇంతలో ఇంకో పురుగు చొక్కాపై పాకుతోంది. మా బడిలో గోడల మీద, బెంచీల మీద బొంత పురుగులు ఉన్నాయి. అందర్నీ కుడుతున్నాయి. బడికి రావాలంటే భయమేస్తుంది.. పాఠశాలలో ఉన్న రావి చెట్టుకు భారీ సంఖ్యలో బొంతపురుగులు పట్టడం వల్ల తాము చాల ఇబ్బంది పడుతున్నామంటున్నాడు పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న దర్శనాల శ్రీకాంత్.
Bontha Worm : కరీంనగర్‌లో - ధన్గర్‌వాడి ప్రాథమిక పాఠశాలలో 300కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కొవిడ్ వ్యాప్తి తగ్గడంతో తిరిగి తెరుచుకున్న పాఠశాలకు ఎంతో సంతోషంగా వచ్చిన విద్యార్థులకు పాఠశాలలో బొంతపురుగులు స్వాగతం పలికాయి. ఒకప్పుడు తాము అడుకున్న చెట్టు చెంతకు వెళ్లలేకపోయారు. తరగతి గదిలోను కూర్చేలేకపోతున్నారు. గోడలపై పాకుతూ, బెంచీలు, వస్త్రాలపై ఎక్కుతున్నాయి. విద్యార్థునుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాటిని చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.
అన్నం తినలేకపోతున్నాం. స్కర్ట్‌లకు, డ్రెస్సులపై పాకుతున్నాయి. వాష్‌రూమ్‌లలో కూడా ఉంటున్నాయి. ముఖంపై కుడుతున్నాయి. అమ్మాయిల పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. టీచర్లకు చెబుతున్నాం. తల్లిదండ్రులకు చెప్పినాం. ఈ పురుగులతో ఇబ్బంది వల్ల వేరే స్కూలుకు వెళ్లాల్సి వస్తోంది అంటోంది.. అయిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎల్ గంగోత్రి
తరగతిలో కూర్చుంటే గదినిండా అవే కనిపిస్తున్నాయి.. పోనీ బయట కూర్చుందామంటే మీదకు పాకుతూ కుడుతున్నాయి. కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నాం. తినే అన్నంలో పై నుంచి వచ్చి పడుతున్నాయి. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. అంటోంది మరో విద్యార్థిని
పాఠశాల ఆవరణలో ఉన్న రావిచెట్టు ఎండి పోయిందని.. దానికి బొంత పురుగులు పట్టాయని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటి నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తగ్గకపోవడం వల్ల ఈ విషయమై స్థానిక కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశాము. బొంద పురుగుల వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనం చేసేటప్పుడు, తరగతి గదిలోను బొంతపురుగులు పాకుతున్నాయి. తప్పని పరిస్థితిలో విద్యార్థులను వేరే పాఠాశాలకు పంపిస్తున్నా మంటున్నారు.
గత 15రోజులుగా పాఠశాలలో ఉన్న చెట్టుకు బొంత పురుగులు పట్టాయి. వాటివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు చాలా సమస్యగా ఉంది. పిల్లలు చాలా భయపడుతున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. - అంజలి, ఉపాధ్యాయురాలు
పాఠశాలలో చెట్టుకు బొంతపురుగులు పట్టాయి. వంట చేసేటప్పుడు పాత్రల్లోను, తినేటప్పడు ప్లేట్లలోను పడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను ఎంఈవో, స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాం. పిల్లలను తాత్కాలికంగా వేరే పాఠశాలకు పంపుతున్నాం. - స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
త్వరలోనే పరిష్కరిస్తాం..
పాఠశాలలో బొంతపురుగుల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని స్థానిక కార్పొరేటర్ జితేందర్ తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. చెట్టును తొలగించాలా.. మరేమైనా మార్గాలు ఉన్నాయా అనే ఆలోచన చేసి.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
బొంత పురుగులతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పాఠశాలను సందర్శించాము. బొంతపురుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెట్టు ఎండిపోయింది అయితే దానిని తొలగించకుండా మరేదైనా మార్గంలో పురుగులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులను తాత్కాలికంగా వేరే పాఠశాలకు పంపిస్తున్నాం -జితేందర్, స్థానిక కార్పొరేటర్
బడిపేరు చెబితే బొంతపురుగులు గుర్తొచ్చి కలలో కూడా కలవరపడుతున్నారు పిల్లలు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. పలువురు విద్యార్థులు, చిన్నారులకు అవి కుట్టడంతో చర్మమంతా దద్దుర్లు తేలి మంటలు వస్తున్నాయి.
ఇదీ చూడండి : వెలవెలబోయిన పర్యాటక స్వర్గధామం.. జాతర దృష్ట్యా లక్నవరానికి నో ఎంట్రీ