కరీంనగర్లో ఖాళీ ప్లాట్లను ఎవరూ పట్టించుకోవకపోవడం వల్ల ముళ్లచెట్లు, మురుగు నీటితో ఇరుగుపొరుగు వారికి ఇబ్బందిగా మారుతోంది. ఓ వైపు కరోనాతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు వారిని మరింత ఇబ్బందులు పెడుతుండటం వల్ల కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలం గురించి ఎవరికి విన్నవించుకోవాలో తెలియని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
నోటీసుల జారీ
రంగంలోకి దిగిన నగరపాలక సంస్థ ఇప్పటికే ఆయా ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. చాలా ప్లాట్లకు సంబంధించిన యజమానుల ఆచూకీ తెలియకపోవడం వల్ల కార్పొరేటర్లు నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ఇలా దాదాపు 1600కుపైగా ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఆ ప్రాంతాల్లోనే
ప్రధానంగా అల్కాపురికాలనీ, ఆదర్శనగర్‌కాలనీ, హౌసింగ్ బోర్డుకాలనీ, బ్యాంకు కాలనీ, తీగల గుట్టపల్లి, కిసాన్‌నగర్, సుభాష్ నగర్, మోహన్ నగర్, కోతిరాంపూర్, సంతోష్‌నగర్, హుసేన్‌పుర తదితర ప్రాంతాల్లో ఉన్నాయని కార్పొరేటర్లు అధికారులకు తెలిపారు.
కఠిన చర్యలే
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో నగర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ సునీల్‌రావు చెప్పారు. గతంలోనే ఖాళీ ప్లాట్లలో ఉన్న మురుగునీరు, వర్షపు నీరు తొలగించుకోవాలని నోటీసులు జారీ చేసినా నిర్లక్ష్యం వహించడం వల్ల కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా ఖాళీ స్థలాల వద్ద మున్సిపల్ ద్వారా బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికీ ఫ్లాట్ల యజమానుల్లో మార్పు రాకపోతే ఆ ప్రాంతాలను తామే శుభ్రం చేయించడమే కాకుండా ప్లాట్ల యజమానులకు భారీ జరిమానా విధించనున్నట్లు కమిషనర్ క్రాంతి స్పష్టం చేశారు.