Kaleshwaram Third TMC: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ తవ్వకం పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఒకవైపు కొన్ని గ్రామాల్లో నిర్వాసితులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నా.. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి జంక్షన్ గేటు వద్ద ఇవాళ తవ్వకం పనులు చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఏకకాలంలో 3 టీఎంసీలు తరలించేందుకు చేపడుతున్న కాల్వ భూసేకరణపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ఎస్సారెస్పీ వరద కాలువ, గాయత్రి పంప్ హౌస్ కోసం గతంలో సేకరించిన భూముల్లో జేసీబీలతో కాలువ పనులు మొదలు పెట్టారు. మూడో టీఎంసీ కాలువ నిర్మాణంపై 12 గ్రామాల నిర్వాసితులు భూసేకరణ ప్రక్రియను వ్యతిరేకించడంతో ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దీంతో ప్రభుత్వ ఆధీనంలోని భూముల్లో కాలువ తవ్వకం పనులు చేపట్టారు. ఇప్పటికే రెండుసార్లు భూములు కోల్పోయిన రైతులు మరోసారి భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు భూ సర్వేకు యత్నించగా గతంలో పలుసార్లు అడ్డుకున్నారు. రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి మండలాల్లోని చేపట్టిన భూసర్వే ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం జలాల కారణంగా తమ భూముల్లో సిరులు పండించే పరిస్థితి నెలకొందని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి భూమి ఇచ్చేదిలేదని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి: DRONE SURVEY: డ్రోన్‌తో భూసర్వేకు అధికారుల యత్నం.. అడ్డుకున్న నిర్వాసితులు
మార్కెట్ ధర ఇస్తేనే భూములిస్తం.. కాళేశ్వరం మూడో టీఎంసీ నిర్వాసితుల అల్టిమేటమ్