కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణాదారులు సమాధులు తవ్విన ఉదంతంపై అధికారులు విచారణ జరిపారు. స్థానికులు మృతి చెందిన వారిని రామడుగు వాగు పక్కన ఖననం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా మృతదేహాలను వాగు పక్కన పూడ్చటంతో సమాధుల దిబ్బగా పేరు పొందింది.
ఇటీవల ఇసుక అక్రమ రవాణా దారులు చెలరేగి వాగులోని ఇసుకను ఖాళీ చేశారు. ఎగువ ప్రాంతంలో ఇసుక తవ్వటాన్ని రైతులు అడ్డుకోవడంతో సమాధుల స్థలాలపై కన్నేశారు. రాత్రి వేళల్లో అధికారుల దృష్టిలో పడకుండా సమాధులు తవ్వటంతో మృతదేహాలు బయట పడ్డాయి. ఓ వైపు అధికారులు సమాధుల స్థలాన్ని సందర్శించగా వాగుకు మరో వైపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఉదంతం చోటు చేసుకుంది. రామడుగు వాగులోని సమధులకు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.