హుజూరాబాద్ ఉపఎన్నికలు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రజలంతా సర్వేలు ఏమి చెబుతున్నాయి. పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంది. ప్రచారానికి ఏయే నాయకులు వస్తున్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ ఇతరత్రా అంశాలతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గత అయిదు నెలలుగా మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంపై నియోజకవర్గంలోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి.అయితే ఎన్నికల ప్రచారంలో నాయకులు చెబుతున్న మాటల ఆధారంగా లోతుగా చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దసరా పండుగ రావడంతో డబ్బు, మద్యం, మాంసం మీ ఇంటికే వస్తుందని ముమ్మరంగా ప్రచారం జరిగింది. దీనితో దసరా ముగియడంతో జరిగిన ప్రచారానికి వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనే అంశంపై రసవత్తరంగా చర్చించుకుంటున్నారు.
తాయిలాల పంపిణీపైనే చర్చ
నియోజకవర్గంలో హోరాహోరీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. గత ఐదు నెలలుగా ఈ చర్చ జరుగుతున్నప్పటికీ చివరి దశ వచ్చేసరికి ఎక్కడ నలుగురు గుమిగూడినా తాయిలాల పంపిణీపైనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచార తారలు ప్రచారంలో పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామంలో రచ్చబండ వద్ద నలుగురు గుమిగూడారంటే చాలు ఈటల గెలుస్తారా.. గెల్లు శ్రీను గెలుస్తారా...కాంగ్రెస్ అభ్యర్ధి గెలుస్తారా అన్న అంశమే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హుజురాబాద్ ఉపఎన్నికలు చర్చలకు వేదికగా మారింది. ఐదు నెలలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రచారంలో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ.. ఈ చర్చలు మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో భాజపా తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉన్నా.. మాజీ మంత్రి ప్రస్తుత మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలపైనే చర్చలు సాగుతున్నాయి.
రచ్చబండల వద్ద లోతైన విశ్లేషణలు
నియోజకవర్గంలో ప్రతి రోజు జరుగుతున్న ప్రచారంలో సాగుతున్న ఆరోపణల పర్వాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ది గురించి చెబుతున్న వారు గెలిచాక ఏమేరకు న్యాయం చేస్తారన్న అంశాన్ని బేరీజు వేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా మద్యం,డబ్బు పంపిణీ జరుగుతోందని చెబుతుండటంతో నిజంగా పంపిణీ చేస్తున్నారా లేదా.. ప్రచారానికి పరిమితం చేశారా అంశాన్ని చర్చిస్తున్నారు.
ఎవరెవరికి దక్కింది...?
దసరా సందర్భంగా నాలుగిళ్లకు ఒక పొట్టేలు, మద్యం బాటిళ్లు, పండుగ ఖర్చు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. పండుగ సంబురాలు గడిచాక ఎవరేమి సరఫరా చేశారో చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఆ పార్టీ పంపిస్తే ఫలానా వ్యక్తికి చేరి ఉంటుందని తమదాకా మాత్రం రాలేదన్నదే ప్రధానంగా వినిపిస్తున్న ముచ్చట. తలలో నాలుకలా ఉంటామని చెప్పే నాయకులు.. గెలిచాక అందుబాటులో ఉంటారా.. ఉండేందుకు అవకాశం ఉందా లేదా ఎవరికి ఓటు వేస్తే తమ గ్రామానికి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషించుకుంటున్నారు. రాష్ట్రంలోని మంత్రులు ఇంఛార్జిలు ఉండి ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు చేసిన సందర్భం మొదటిది కావడంతో ఆయా గ్రామాల్లో ఈ ఎన్నికల గురించి చర్చించే పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: EC new rule: ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదు: సీఈసీ