ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెబుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్... పార్టీ నుంచి వెళ్లిపొమ్మని గెంటేసినా అక్కడే ఉంటున్నారని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తొండలు గుడ్లు పెట్టని భూములు కొన్నానని చెబుతున్న ఈటల... కోట్ల రూపాయలు వెచ్చించి రావల్‌కోల్‌లో కొన్న 68 ఎకరాల గురించి ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. రావల్‌కోల్ ప్రాంతంలో ఒక్కో ఎకరానికి 3 కోట్ల ధర పలుకుతున్న భూములను... తన బినామీ కేశవరెడ్డితో కలిసి కొనుగోలు చేసినట్లు ఆరోపించారు.
దాదాపు రూ.200 కోట్లు విలువ చేసే భూములను ఎలా కొనగలిగారని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తాను బీసీ నేత అని చెప్పుకొనే ఈటల రాజేందర్... తనయుని పట్టాదారు పాస్‌పుస్తకంలో మాత్రం ఈటల రాజేందర్ రెడ్డి అని ఎందుకు రాయించుకున్నారని నిలదీశారు. ఒక వేళ పొరపాటు దొర్లి ఉంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఎందుకు సరిచేయించలేదో చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ బీసీలను అణగదొక్కారని.. అడ్డువచ్చిన బీసీ నేతలపై కేసులు పెట్టించారని కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు.