దళితబంధు పథకం అమలును అడ్డుకుంటున్నాని తనపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భాజపా నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాను దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేసే సత్తా లేకనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో(Huzurabad by election 2021) భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఈటల.. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఈటల..... కేసీఆర్‌వి ఎన్నికల మాటలే తప్ప చేతలు ఉండవని ఆరోపించారు.
అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. దళితబంధు ప్రకటించి 70 రోజులు అయిందని... ఇప్పటివరకు అందరికీ ఎందుకు అందించలేదు? అని నిలదీశారు. ఈటల రాజేందర్ మేలు చేస్తాడే కానీ.. కీడు తలపెట్టడు అని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి.. సంపన్నులకు కాదని తాను కొట్లాడిన అని చెప్పారు. అవన్నీ అడిగితేనే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని’ ఈటల పేర్కొన్నారు.
రైతులు పండించిన ధాన్యం కొనమంటే కేసీఆర్ మేం షావుకారులమా? వడ్లు కొనడానికి అన్నారు. అందుకే ఐకేపీ సెంటర్స్ ఉంటాయి. ధాన్యం కొంటాయి అని చెప్పాను. ఓటుకు రూ.20 వేలు ఇచ్చినా తీసుకుంటారు. ఓటు మాత్రం కమలం మీదనే. ఇది కొడంగల్ కాదు. నాగార్జునసాగర్ కాదు. కేసీఆర్ ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా రూ.వెయ్యి కోట్లు పెడతారట. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ ప్రజలు డబ్బుకు లొంగరు. భాజపాదే గెలుపు.
-ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి
ఇదీ చదవండి: Asaduddin owaisi cricket: భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్‌పై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు