Monkeys in karimnagar: కోతుల గుంపులు పల్లెలు, పట్టణాలపై విరుచుకుపడుతున్నాయి. కరీంనగర్ శివారులోని గుట్టలు గ్రానైట్ క్వారీలుగా మారడం, వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరికేయడంతో కోతులకు ఆవాసం లేకుండా పోతోంది. ఆహారం సైతం సమస్యగా మారింది. అంతేకాకుండా వాటి సంఖ్య ఏటికేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. గ్రామాల పరిధి దాటి పట్టణాలపై దాడి చేస్తున్నాయి. కోతుల స్వైరవిహారంతో కరీంనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయి. చివరకు చెప్పులు, ఆరేసిన దుస్తులనూ వదలడంలేదు. ఎత్తుకెళ్లి ఎక్కడెక్కడో పడేస్తున్నాయి.
కోతుల బెడదతో రహదారులపై నడవాలంటే మహిళలు, చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. కోతుల దండు వచ్చిందనే వార్త అందితే కొంతమంది తలుపులు వేసుకొని ఇళ్లకే పరిమితం అవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరీంనగర్‌లోని రాంనగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట, జ్యోతినగర్ ప్రాంతాల్లో వానరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరపాలకవర్గంపై ప్రజల ఒత్తిడి పెరగడంతో చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని కనీసం వెయ్యి కోతులను బంధించాలనే ఉద్దేశంతో టెండర్లు ఆహ్వానించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి ఒక టెండర్ దాఖలవడంతో ఒక్కో కోతిని బంధించడం కోసం 850 రూపాయలు చెల్లించేందుకు అంగీకరించారు. తొలివిడతలో 200కుపైగా మర్కటాలను బంధించారు.
కోతులను బంధించి వదిలిపెట్టడానికి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు లేవు. కొండగట్టు లాంటి ప్రాంతాల్లో అడవులు తరిగిపోవడమూ సమస్యగా మారింది.-
సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
గతంతో కోతులకు కుటుంబ నియంత్రణ చేయాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం కోతులను పట్టుకొని అడవిలో వదిలేస్తున్నారు. తాత్కాలికంగా అడవుల్లో వదిలి చేతులు దులుపుకోవడం కంటే శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకొంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: