కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజిలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. గోదావరి నది జలాల భారీ ఎత్తిపోతలు... కృత్రిమ జలపాతాన్ని తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి చేపడుతున్న ఎత్తిపోతలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. బాహుబలి పంపులతో అధిక మొత్తంలో ఎత్తిపోతలతో జలహోరు కొనసాగుతోంది.
రోజుకు 2 టీఎంసీలు
గోదావరి నది జలాలు ఇక్కడి నుంచి ఎస్సారెస్పీ(SRSP) వరద కాలువలోకి తరలి వెళ్తున్నాయి. గత నెల 17న మొదలు పెట్టిన ఎత్తిపోతల ద్వారా మధ్య, దిగువ మానేరు ప్రాజెక్టులకు ఇప్పటి వరకు సుమారు 24 టీఎంసీల నీటిని తరలించారు. రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతలు చేపట్టేందుకు... 6 భారీ పంపులు నడుస్తున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా పార్కు
గాయత్రి పంప్ హౌస్ ఎత్తిపోతల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన పార్కు ప్రకృతి అందాలను మరింత పెంచుతోంది. రంగురంగుల పూల మొక్కలు, బోన్సాయ్ వృక్షాలు ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సందర్శకులు తమ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి... గాయత్రి పంప్‌హౌస్ వద్ద ఆహ్లాదకరంగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి: kaleshwaram:కాళేశ్వరం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల