No Electricity Subsidy in Karimnagar District: కరోనా లాక్‌డౌన్‌తో బేజారైన కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విద్యుత్ సబ్సిడీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విద్యుత్ వినియోగించినా ఆర్థిక భారం పడే అవకాశం లేదని, కులవృత్తిపై ఆధారపడిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 2021 ఏప్రిల్ నుంచి నాయి బ్రాహ్మణులు, రజకుల కోసం 250యూనిట్ల వరకు విద్యుత్ మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Electricity Subsidy is stopped for Barbers : ఆయా దుకాణాల యజమానులు విద్యుత్‌ను వినియోగించినా, 250యూనిట్లను మినహాయించి మిగతా యూనిట్లకు మాత్రమే బిల్లులు పంపించే వారు. చాలా వరకు దుకాణాల్లో 250 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించడంతో, బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలోనూ ప్రభుత్వం సబ్సిడీకి సంబంధించిన డబ్బు విడుదల చేయకపోవడంతో, విద్యుత్ అధికారులు ఆయా హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీ షాపులపై బిల్లు చెల్లింపు కోసం ఒత్తిడి చేయడంతో అక్టోబర్‌లో నిధులు విడుదల అయ్యాయి.
గత మూడు నెలలుగా సబ్సిడీ రావడం లేదంటూ మరోసారి దుకాణాదారులను ఒత్తిడి చేస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1245 మంది నాయిబ్రాహ్మణులు, 2670మంది లాండ్రీ యజమానులు ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన విద్యుత్ రాయితీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నాయిబ్రాహ్మణులు కోరుతున్నారు.
ఇందులో విద్యుత్ శాఖ అధికారుల తప్పేమి లేదని, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఈ గండం నుంచి గట్టెక్కుతామని లాండ్రీ దుకాణాదారులు అంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా అన్న ఉద్దేశ్యంతో, బొగ్గుపెట్టే తీసేసి కరెంటు పెట్టె తీసుకున్నామని లాండ్రీ యజమానులు చెబుతున్నారు. తమకు కాలంతో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్‌తోనే తమ వృత్తి ముడి పడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా చిన్నాభిన్నమైన నాయీ బ్రాహ్మణులు, రజకులు నిలదొక్కుకొనేలా చేసేందుకు విద్యుత్ రాయితీతోపాటు దళిత బంధు తరహాలో, బీసీ బంధు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: