రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిళ్లను కారు తుడిచేందుకు వినియోగిస్తున్నారు ప్రభుత్వ వైద్య సిబ్బంది. అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే సెలైన్‌ను సాక్షాత్తూ వైద్య సిబ్బందే వృథా చేస్తున్నారు. ఇదేంటని అడిగితే అది ఖాళీ సీసాలో నీళ్లు నింపామని బుకాయిస్తున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో జరిగింది.
కాయకల్ప కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్‌లోని ఏరియా ఆస్పత్రిని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. గోడలకు సున్నం వేస్తుండగా అక్కడే ఉన్న ఆస్పత్రి ఏవో డాక్టర్ ప్రత్యూష కారుపై పడింది. ఇది గమనించిన వైద్యురాలు తన కారును తుడుచుకునే ప్రయత్నం చేయగా... అక్కడే ఉన్న సిబ్బంది నీటితో తుడువాల్సిన కారును ఏకంగా రోగికి ఎక్కించాల్సిన సెలైన్ బాటిల్‌తో తుడిచింది. దీన్ని అక్కడే ఉన్న రోగులు చరవాణిలో చిత్రీకరించారు.
కేవలం ప్రథమ చికిత్సలే :
రోగులకు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించి వరంగల్ ఎంజీఎంకు పంపిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగినా వరంగల్‌కు రెఫర్ చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటితోనే కడిగాం: సూపరింటెండెంట్
ఖాళీ సెలైన్ బాటిల్‌ను నీటితో నింపి కారును తుడిచారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్ చెబుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతేనే వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేస్తున్నామన్నామని వెల్లడించారు.