వినాయకుని నిమజ్జనంలో అధికారులు తీరుపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటి లోతును కూడా గుర్తించకుండా విగ్రహాలను నిమజ్జనం చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కొత్తపల్లి చెరువు వద్ద జరిగింది.
అసలేమైందంటే..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనానికి నాలుగు చోట్ల అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్తపల్లి చెరువు, మానకొండూర్ చెరువు, చింతకుంట కాలువలో నిమజ్జనం చేసేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. కొత్తపల్లి చెరువు వద్ద భారీ క్రేన్లను ఉపయోగించి విగ్రహాలను నిమజ్జనం చేశారు.
అయితే వినాయక ప్రతిమలను నీటి మధ్యలో కాకుండా ఒడ్డునే పడేశారు. దీంతో గణేశుని విగ్రహాలన్నీ నీటిపైనే దర్శనమిస్తున్నాయి. విగ్రహాలు పూర్తిగా నీటిలో మునగక పోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ముగిసినా ప్రతిమలు ఇంకా అలాగే కనిపిస్తుండడంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇదీ చూడండి: GHMC Mayor on Immersion: 'నిమజ్జనం వేగంగా జరిగేలా ఎక్కువ క్రేన్లు ఏర్పాటు చేశాం'