'చరిత్ర తిరగేస్తే అశోకుడు మొక్కలు నాటించెను.. బావులు తవ్వించెను అని చదువుకుంటున్నాం. అదే కేసీఆర్ చరిత్ర తిరగేస్తే హుజూరాబాద్ ఉపఎన్నికలో వెయ్యి కోట్లు ఖర్చు చేసేను, వంద కోట్లు మద్యం పంచెను, రూ.4500 కోట్ల విలువైన జీవోలు ఇచ్చెను.. అయినా మట్టికరిచెను' అని చదువుకోవాల్సి ఉంటుందని.. మాజీ మంత్రి, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలో నిర్వహించిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఈటల పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడుకొనే బాధ్యత యువతపైనే ఉందని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించిన ఈటల.. ఈనెల 27 తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోతారని.. అప్పుడు మద్యం సీసాలు, డబ్బు పంపిణీ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంటుందన్నారు.. ఈటల రాజేందర్.
'525 రోజులు గడిచింది. ఇక మిగిలింది ఐదు రోజులే.. 27న బయట నుంచి వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. అప్పటి నుంచి అంతా మీ చేతుల్లోకి వస్తుంది. 27 నుంచి 30 తేదీ వరకు కేసీఆర్ కుట్రను పాతరేసి.. 30న ఊహకు అందని మెజార్టీ ఇవ్వాలి.'
- ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
ఈటల రాజేందర్ విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తనలా 1500 ఓట్ల మెజార్టీతో కాకుండా.. భారీ మెజార్టీతో ఈటలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఓడిపోతారనే నిఘావర్గాల సమాచారం మేరకే.. హుజూరాబాద్‌కు కేసీఆర్ రావడం లేదని రఘునందన్ విమర్శించారు.
'ఓడిపోతారనే ఇంటిలిజెన్స్ సమాచారంతోనే హుజూరాబాద్‌కు కేసీఆర్ రావడం లేదు. తాము బిజీగా ఉన్నామనే చెప్పేందుకే తెరాస ప్లీనరీ నిర్వహిస్తోంది.'
- రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీచూడండి: KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్