నోరులేని వారిపై, దిక్కులేని వారిపై.. రాజ్యం కక్ష చూపుతున్నప్పుడు.. కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రయత్నించడం మంచి పరిణామమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందనే నిజం త్వరలోనే తేలుతుందని... ఇలాంటి దుర్మార్గాలు, అన్యాయాలను ఎండగట్టేలా న్యాయస్థానం స్పందించిన తీరుకు నా ధన్యవాదాలు. ఎవరి బాధ్యతలు, ఎవరి గౌరవం వాళ్లకు ఉంటది. నన్ను పిలిచి.. ఇది నచ్చలేదని చెబితే నేనే రాజీనామా చేసేవాణ్ని. ఇంతటి రాద్ధాంతం అవసరమా? ఇంత భూ కుంభకోణమని చెప్పడం.. 500మంది పోలీసులు, వందలమంది రెవెన్యూ అధికారులను పెట్టి నామీద ఇంత కక్షసాధింపు చర్యలవసరమా? సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపమని చెప్పాక కూడా పదేపదే ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఎవరెవరు నాతో ఏమేమి బాధలు చెప్పుకొన్నరో నాకు, వాళ్లకు తెలుసు. వాళ్లంతా నా సహచరులే. ఈశ్వరన్నతో, వినోదన్నతో, మా రసమయితో ఏళ్లతరబడి అనుబంధం ఉంది. నేను ఎవరి దగ్గరికి వెళ్లడం లేదు. నాకు సపోర్ట్ చేయమని కోరడం లేదు. అవమానం జరిగింది కాబట్టి కోర్టుకు వెళ్లాను. నా ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను.
వారి విజ్ఞతకే వదిలేస్తున్న
కొందరు మంత్రుల మాటల్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అంతరాత్మ సాక్షిగా వారు మాట్లాడట్లేదు. ఎవరో రాసిచ్చింది.. చెప్పమన్నది చెబుతున్నారు. ‘చీమలు పెట్టిన పుట్టలో పాములెక్క దూరాడని.. మేక వన్నె పులి అనడం’ సరైనది కాదు. ఎవరి చరిత్ర ఏమిటనేది నేనేమి చెప్పను. అధికారం నీడలో ఉన్నంత మాత్రాన.. చేసిన చెడ్డ వ్యవహారాలు, దందాలు కప్పిపుచ్చుకోవు. ఎవరెవరు ఏం మాట్లాడారనేది నా దగ్గర ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా సమస్యల గురించి సీఎంను కలిసేందుకు వెళ్లాము. మమ్మల్ని గేట్ల వద్ద ఆపారు. అక్కడే ప్రెస్ వాళ్లున్నరని, మా ఇజ్జత్ కోసం.. కనీసం లోపలికి వెళ్లి తిరిగి వస్తామని రెక్వెస్ట్ చేశాం. సీఎంకు ఆరోగ్యం బాలేదనో.. మూడ్ బాగోలేదనో పోనీయకపోతే ఇదే గంగుల కమలాకర్ నాతో ‘ఇంత అహంకారముంటదా అన్న!’ అని అన్నారు. మన ఈగో దెబ్బతింటే కరీంనగర్ నుంచే మరో విప్లవం వస్తుందన్న వ్యక్తి ఆయన. నేనేదో సీఎంని కావాలని నినాదాలిస్తున్నానని విమర్శలు చేస్తున్నారు. వాళ్లే నా ర్యాలీలో కొందరితో నినాదాలు చేయించి ఉంటారు. మహమూద్ ఆలీ, నాయిని నర్సింహారెడ్డి గేట్లనుంచే ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్లిన ఉదంతాలు మీ అందరికీ తెలుసు. నేనెప్పుడూ పార్టీ లైన్ దాటలేదు. ముఖ్యమంత్రి తరువాత ఆయన కొడుకు సీఎం అంటే కూడా స్వాగతించాను. 2014 వరకు సీఎం కేసీఆర్ ప్రజల్ని, ధర్మాన్ని, ఉద్యమాన్ని నమ్ముకున్నారు. 2014 తరువాత గాంధీలాగా చెలామణి అవ్వాల్సిన కేసీఆర్ ఎవరి సలహాల వల్లనో.. ఎవరి రిపోర్టుల వల్లనో.. చివరికి మంత్రులకూ అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి ఎదురైంది.
ఏడేళ్లుగా ఆ పరిస్థితి లేదు..
నేను కాంగ్రెస్ వాళ్లతో కలిశానని కొందరంటున్నారు. 2014కు ముందు నియోజకవర్గ పనుల కోసం కాంగ్రెస్ మంత్రుల దగ్గరకు వెళ్లలేదా.. దరఖాస్తులు ఇచ్చుకోలేదా? వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. నియోజకవర్గ సమస్యలపై నేను కలిశాను. గత ఏడేళ్లుగా ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా మంత్రుల దగ్గరికి రాలేదు అని ఈటల పేర్కొన్నారు.
అభిప్రాయ సేకరణలో బిజీ..
ఈటల మంగళవారమంతా పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో అభిప్రాయ సేకరణను చేపట్టారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా మండలాల వారీగా తరలివచ్చిన అభిమానులు, కులసంఘాల నాయకులతో సమాలోచనలు జరిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ఎన్నారైలతోనూ ఆయన జూమ్ మీటింగ్‌ను నిర్వహించి సలహాలు తీసుకున్నారు.
తక్కువ చేయొద్దు
‘‘కేసీఆర్ నన్ను ఈ స్థాయికి తెచ్చారు. నేను దద్దమ్మను అయితే ఇక్కడిదాకా తెచ్చేవారు కాదు. ఆరుసార్లు గెలిచాను. ఆయన సలహాలు, వ్యూహాలు ఒంటబట్టించుకున్నాను. నామీద ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే మీకే నష్టం తప్ప నాకేమి కాదు. యుద్ధం గెలవాలంటే ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో.. కార్యకర్త కూడా అంత ముఖ్యమే. అందరి సమన్వయం, త్యాగం, ఉంటేనే రిజల్ట్ వస్తుంది. నిన్న వరంగల్‌లో గెలిచాం. కార్యకర్తలు లేకుండా గెలిచామా? ఎవరి గౌరవం, ఎవరి బాధ్యత వారికుంటుంది. అందుకనే నన్ను తక్కువ చెయ్యొద్దు!’’ అని ఈటల అన్నారు.
ఇదీ చూడండి: ఏ చట్టం కింద సర్వేకు వెళ్లి బోర్డు పెట్టారు?: హైకోర్టు