Igloo Theater In Rajarampally: జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో ఇగ్లూ సినిమా థియేటర్ నిర్మిస్తున్నారు. గ్రామస్థులు సినిమా చూడాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబయిలో చూసిన ఇగ్లూ థియేటర్ గ్రామంలో నిర్మించాలని ఆలోచన చేశారు. కేవలం 20 గుంటల స్థలంలోనే ఇగ్లూ ఇళ్ల తరహాలో బుల్లితెర థియేటర్ నిర్మాణం చేపట్టారు. 100 సీట్ల సామర్ధ్యం, 42 అడుగుల వృత్తంలో రోజుకు 5 షోలు ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ అనుభూతి కలిగే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90శాతం పనులు పూర్తికాగా.. మరో నెలరోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
రాజారాంపల్లిలో థియేటర్ నిర్మాణంతో ధర్మపురితోపాటు ధర్మారం, వెల్గటూరు మండలాల ప్రజలకు అందుబాటునే ఉంటుంది. ముంబయిలో ఛోటా మహారాజన్ ఫ్రాంచైజ్ ఒప్పందం మేరకు ఇగ్లూ థియేటర్ నిర్మాణం జరుగుతోంది. నలుగురు భాగస్వాములు ప్రజలను ఆకర్షించే విధంగా రూ. 85లక్షల పెట్టుబడితో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కరు పట్టణాలకు వలస వెళుతున్న క్రమంలో... తమ ప్రాంతవాసుల కోసం రాజారాంపల్లిలో థియేటర్ నిర్మిస్తున్నామని యజమానులు తెలిపారు.
ఛోటా మహారాజన్ హాల్స్‌గా పిలిచే ఈ థియేటర్లు మహారాష్ట్రలోని అకోలా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌తోపాటు ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాయి. హైదరాబాద్ నిజాంపేటలోనూ నిర్మాణమవుతోంది. ఫైబర్ వుడ్‌లాంటి సామగ్రితో స్వల్పకాలిక వ్యవధిలోనే నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి: