కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తమ పంట పొలాల్లో ఉన్న గడ్డి కొయ్యలను తగులబెట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేయడంలో విఫలమవ్వడం వల్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
బుధవారం ఒక్కరోజే నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. శంకరపట్నంలోని వ్యవసాయ క్షేత్రంలో మంటలు వ్యాపించి సెల్ టవర్ దగ్ధమైంది. ఆ పక్కనే నిలిపిన టిప్పర్‌తో పాటు మరో వాహనం అగ్నికి ఆహుతైంది. సుమారు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పేశారు.
గన్నేరువరం మండలంలోనూ పలు చోట్ల అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోందని పలువురు భావిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.