తాను తెరాస నుంచి వెళ్లలేదని, ఆ పార్టీ నేతలే వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆత్మగౌరవం అంటే తనది కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి భాజపా కార్యకర్తల సమావేశాన్ని ఈటల రాజేందర్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు.
2018 ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాసకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేబినెట్ లేకుండా నడిపిన చీకటి చరిత్ర కేసీఆర్‌ది. మాకు నేరుగా ముఖ్యమంత్రి దొరకడు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎంతమంది అమ్ముడుపోయినా, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోరు. - ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోనే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయని.. కేసీఆర్ సొంత డబ్బుతో కాదని ఈటల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణలో అవినీతి జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ముందుగానే దరఖాస్తు పంపినట్లు చెప్పారు. రాబోయే కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేది హుజూరాబాద్ ప్రజలేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: KTR:హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుచేయండి: కేటీఆర్