దళితులను అవమానించడం సీఎం కేసీఆర్‌కు కొత్తేమి కాదని.. కేసీఆర్ చేసిన అవమానాలు భరించలేకే ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆయనను ఎన్నో వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల చేపట్టిన ప్రజాదీవెన యాత్ర పదకొండో రోజుకి చేరుకుంది. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో యాత్ర కొనసాగింది.
ప్రజా దీవెన యాత్రలో విలాసాగర్ గ్రామానికి చెందిన దళితులు.. ఈటల కాళ్లను కడిగారు. ఆ సమయంలో వారి కాళ్లను ఈటల మొక్కారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడానికి ఈటల రాజేందర్ రాజీనామానే కారణమని వారు పేర్కొన్నారు.
రాజయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. చివరకు మొండి చేయి చూపించారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రెండు నెలలకే తొలగించారు. ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిపై ఆరోపణలు చేసి.. వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. గురుకులాల్లో పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఎన్నో అవమానాలకు గురిచేశారు. ఆ అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక ప్రవీణ్ రాజీనామా చేశారు.
-ఈటల రాజేందర్, భాజపా నేత
ఇదీ చదవండి: Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ