ఓటమెరుగని ప్రయాణం ఈటల రాజేందర్ ప్రస్థానం. ప్రత్యర్థిపై విజయం సాధించటం ఓ ఎత్తైతే.. అత్యధిక మెజార్టీతో విజయబావుటా ఎగరేయటంలోనే ఒక అభ్యర్థి ఎంత గొప్ప నాయకుడో తెలిసిపోతుంది. రాజేందర్ కూడా అలాంటి నాయకుడే. ప్రజాప్రస్థానం తొలినాళ్ల నుంచి నేటి వరకు రికార్డుస్థాయి మెజార్టీతో తన సత్తా నిరూపించుకుంటూ వస్తున్నారు.. ఈటల రాజేందర్.
2004 నుంచే మొదలు..
2004లో కమలాపూర్ నియోజకవర్గంలో తెరాస తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్ తొలిసారి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసిన దామోదర్ రెడ్డికి 48 వేల 774 ఓట్లు రాగా ఈటలకు 68 వేల 393 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో 19 వేల 619 మెజార్టీ వచ్చింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఇందులో భాగంగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌పై మరోసారి ముద్దసాని దామోదర్ రెడ్డి పోటీ చేశారు. 2008లో జరిగిన ఉపఎన్నికలో ఈటలకు 54 వేల 92 ఓట్లు రాగా... ముద్దసానికి 31 వేల 808 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి 22 వేల 284 ఓట్ల మెజార్టీతో ఈటల విజయం సాధించారు.
ఉద్యమనాయకునిగా భారీ మెజార్టీ..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన హుజూరాబాద్ నుంచి 2009లో తెరాస అభ్యర్థిగా ఈటల పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌పై 15 వేల 35 ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈటలకు 56 వేల 752 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి 41 వేల 717 ఓట్లు వచ్చాయి. తెరాస ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలతో 2010లో మరోసారి ఉపఎన్నికలు వచ్చాయి. ఈసారి ఉద్యమ ఊపులో భారీమెజార్టీతో ఈటల గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై 76 వేల 227 ఓట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించారు.
రాష్ట్రం సాధించుకున్నాక...
రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఈటల 57 వేల 37 ఓట్లు భారీ మెజార్టీ గెలిచారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేతిరి సుదర్శన్ రెడ్డికి 38 వేల 278 ఓట్లు రాగా.... ఈటలకు 95 వేల 315 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ ముందస్తు నిర్ణయంతో 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఈటల మరోసారి గెలిచారు. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 61 వేల 121 ఓట్లు రాగా... ఈటలకు లక్ష 4 వేల 840 ఓట్లు పోలయ్యాయి. 2018 లో 43 వేల 716 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థిగా ఈటల విజయం సాధించారు.
ఆత్మగౌరవమే గెలిచింది..
ఇక ఆత్మగౌరవం పేరుతో.. తెరాస పార్టీని వీడిన ఈటల.. మరోసారి ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. జెండా ఏదైనా.. తన ప్రాధాన్యం ప్రజాసంక్షేమమే అని తన గెలుపుతో స్పష్టం చేశారు. భాజపాలో చేరి.. ఉపఎన్నిక బరిలో దిగిన ఈటలను ప్రజలు కూడా.. అలాగే స్వాగతించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై జరిగిన హోరాహోరీ పోటీలో.. ఘనవిజయం సాధించారు. ఏకంగా 24 వేల 68 ఓట్ల ఆధిక్యాన్ని సాధించి.. ప్రజానాయకునిగా మరోసారి నిరూపించుకుని.. తన విజయప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: