గతంలో అధికశాతం దళితుల కోసం తన ప్రాణమున్నంత వరకు పోరాడుతానన్న కేసీఆర్.. వారికిచ్చిన హామీలను తుంగలో తొక్కారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. మొట్టమొదటి సీఎంను దళితున్ని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని ఆనాడు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరించారన్నారు. నియోజకవర్గంలోని ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మర్రిపల్లిలో పర్యటించారు.
నిజం బయటకు రాక తప్పదు
దళితబంధు తాము ఆపుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తాత్కాలికంగా నిజం ఓడిపోయినా.. నివురు గప్పినా నిప్పులా తప్పకుండా బయటకు వస్తుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో దళితుడినే సీఎం చేసి కాపలాగా ఉంటానని మోసం చేశారని దుయ్యబట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని 'దళిత ప్రైడ్' అనే స్కీం పెట్టి మూడున్నర ఏళ్లుగా రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సీఎం మోసాన్ని గ్రహించకుండా కొంత మంది మేధావులు వాటిని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధుపై సంపూర్ణ అధికారం కలెక్టర్లకు కాకుండా లబ్ది దారులకే ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఆనాడు ఉద్యమనేతగా ఈ రాష్ట్ర జనాభాలో దళితులు అధికశాతం ఉన్నారని ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పారు. బలహీన వర్గాల ప్రజలు 85 శాతం ఉన్నారని చెప్పిండు. ఈ తెలంగాణ ఆకలి కేకలు ఉండకూడదంటే దళితున్ని సీఎం చేస్తానని మాట ఇచ్చారు. అవసరమైతే తల నరుక్కుంటా తప్ప మాట తప్పనని చెప్పిండు. దళితున్ని ముఖ్యమంత్రి చేసి కాపలాగా ఉంటానని చెప్పిండు. మరో మాట ఇచ్చిండు. మూడెకరాల భూమి ఇస్తానన్నడు. ఇవ్వలే. ఇవాళ దళితులు గొప్ప వ్యాపార వేత్తలు కావాలని మరో పథకం తెచ్చిండు. దళిత ప్రైడ్ అని పేరు పెట్టిండు. ఇంతవరకు వాళ్లకు సబ్సిడీలు ఇవ్వలేదు. ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదు. ఎస్సీలకు కూడా రేషన్, పింఛన్ ఇవ్వకుండా ప్రజలను వేధిస్తున్నారు. నా ప్రాణమున్నంత వరకు దళితుల కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నడు. దళితజాతికి తప్పనిసరిగా దళితబంధు ఇవ్వాల్సిందే. - ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
ఇదీ చూడండి: TRS Leader Vinod Kumar : కేంద్రం ఇచ్చిన నిధులెన్నో చెప్పండి.. ఆలోచించి ఓటెయ్యండి